షాకింగ్.. భార్యను 120 మందికి అమ్మిన భర్త.. డ్రగ్స్‌కు బానిసగా మార్చి..
స్వీడన్‌లో వెలుగుచూసిన ఓ దారుణమైన ఘటన ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తన భార్యను దాదాపు 120 మందికి విక్రయించి, ఆమెతో బలవంతంగా...
By - అంజి |
షాకింగ్.. భార్యను 120 మందికి అమ్మిన భర్త.. డ్రగ్స్‌కు బానిసగా మార్చి..
స్వీడన్‌లో వెలుగుచూసిన ఓ దారుణమైన ఘటన ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తన భార్యను దాదాపు 120 మందికి విక్రయించి, ఆమెతో బలవంతంగా శృంగార పనులు చేయించిన 62 ఏళ్ల వ్యక్తిపై అక్కడి ప్రాసిక్యూటర్లు సోమవారం అభియోగాలు నమోదు చేశారు. గతంలో 'హెల్స్ ఏంజెల్స్' అనే బైకర్ గ్యాంగ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేసిన నిందితుడు, తన భార్య బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏళ్ల తరబడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. 2024లో ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించిన 'గిసెల్ పెలికాట్' కేసుతో దీనిని పోలుస్తూ, స్థానిక మీడియా దీనిని 'స్వీడిష్ పెలికాట్ కేసు'గా అభివర్ణిస్తోంది.
నిందితుడు తన భార్యను డ్రగ్స్‌కు బానిసగా మార్చి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పురుషులతో లైంగిక చర్యల్లో పాల్గొనేలా ఒత్తిడి తెచ్చేవాడని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికోసం అతను ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇవ్వడం, విటులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, స్వయంగా కాపలా కాయడం వంటి పనులు చేసేవాడు. ఆమె నిరాకరించినప్పుడు హింసించడం, బెదిరించడం వంటివి కూడా చేసేవాడు. 2022 ఆగస్టు నుండి 2025 అక్టోబర్ మధ్య కాలంలో ఈ అకృత్యాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో లైంగిక సేవలు కొనుగోలు చేసిన దాదాపు 120 మందిని అధికారులు గుర్తించగా, వారిలో ఇప్పటికే 26 మందిపై కేసులు నమోదయ్యాయి. స్వీడన్ చట్టాల ప్రకారం శృంగారం అమ్మడం నేరం కాదు కానీ, కొనడం, దానికి మధ్యవర్తిత్వం వహించడం తీవ్రమైన నేరం. ఈ క్రమంలో నిందితుడిపై అగ్రివేటెడ్ పింపింగ్ (వ్యభిచారం ప్రోత్సహించడం), ఎనిమిది అత్యాచారాలు, నాలుగు అత్యాచార యత్నాలు, దాడి కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానుంది.