వదినతో వివాహేతర సంబంధం.. అడ్డుపడుతోందని తల్లిని చంపిన కొడుకు

గుజరాత్‌లోని సూరత్‌లో మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతోందన్న కోపంతో...

By -  అంజి
Published on : 13 March 2026 8:20 PM IST

Surat Murder Case, Illicit Relationship Murder, Hamida Khatun Murder, Surat Crime Branch Arrest, CCTV Evidence Murder, Family Involvement Crime Surat

వదినతో వివాహేతర సంబంధం.. అడ్డుపడుతోందని తల్లిని చంపిన కొడుకు

గుజరాత్‌లోని సూరత్‌లో మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుపడుతోందన్న కోపంతో కన్నతల్లిని.. చిన్న కొడుకు, పెద్ద కోడలు కలిసి అత్యంత కిరాతకగా హత్య చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ గుట్టును రట్టు చేసి నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు హమిదా ఖాతూన్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు పర్వేజ్, తన పెద్దన్న భార్య షబానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అక్రమ సంబంధాన్ని తల్లి హమిదా తీవ్రంగా వ్యతిరేకించేది. దీనికి తోడు ఇంట్లో డబ్బుల విషయంలో కూడా తరచూ గొడవలు జరుగుతుండేవి.

తన సంబంధానికి అడ్డు వస్తోందని భావించిన పర్వేజ్, ఎలాగైనా తల్లిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ కుట్రలో తన అన్న భార్య షబానా, ఆమె తండ్రి ఫిరోజ్ ఆలం కూడా చేతులు కలిపారు. మార్చి 10వ తేదీన పర్వేజ్, షబానా,8 ఫిరోజ్ ఆలం కలిసి హమిదాను గొంతు నులిమి చంపేశారు. అనంతరం శవాన్ని ఒక రోజు పాటు ఇంట్లోనే దాచి పెట్టారు. మార్చి 11న మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి, చేతులు కాళ్లు కట్టేసి సమీపంలోని ఒక గుడి వద్ద పడేశారు. ఏమీ తెలియనట్టుగా పర్వేజ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. తన తల్లి బట్టలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లి తిరిగి రాలేదని 'మిస్సింగ్' కేసు పెట్టాడు. పోలీసులు విచారణ మొదలుపెట్టగా, బుధవారం ఉదయం ఒక సంచిలో కట్టి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

సూరత్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ భవేష్ రోజియా నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు. మృతురాలి కాళ్లు, చేతులు కట్టడానికి వాడిన తాళ్లపై పోలీసులకు అనుమానం వచ్చింది. బాధితురాలి ఇంటిని సోదా చేయగా, అక్కడ కూడా అదే రకమైన తాళ్లు దొరకడం నిందితులపై అనుమానాన్ని బలపరిచింది. విచారణలో పర్వేజ్, షబానా చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో వారు నిజాన్ని ఒప్పుకున్నారు. నిందితుడు ఫిరోజ్ ఆలం శవాన్ని సంచిలో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. హత్య అనంతరం ఫిరోజ్ ఆలం బీహార్‌కు పారిపోగా, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పాట్నా రైల్వే స్టేషన్‌లో బీహార్ ఎస్టీఎఫ్ దళాలు అతడిని పట్టుకున్నాయి. ప్రస్తుతం పర్వేజ్, షబానా, ఫిరోజ్ ఆలంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నతల్లిని చంపినందుకు నిందితుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం చూసి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు.

Next Story