హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla
హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు వరంగల్ జిల్లా చెందిన ప్రవళికగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు క్లూస్ టీం గదిలో ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రవళిక ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లికి సూసైడ్ నోట్ రాసింది. 'అమ్మ నేను నష్టజాతకురాలిని ... నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతునే ఉన్నారు. నేను మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు అన్యాయం చేసి వెళ్ళుతున్నాను. నన్ను క్షమించండి' అంటూ ప్రవల్లిక అమ్మ కు సూసైడ్ నోట్ రాసింది. అయితే ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులందరూ భారీ ఎత్తున చిక్కడపల్లి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేపట్టారు. ప్రవళిక గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసినందుకు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందంటూ ఆందోళన చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అశోక్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వేల సంఖ్యలో యువతి యువకులు ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కింద ఆందోళన చేశారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.