ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నందిగామ మండలం రైతుపేటలో ఓ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీసుకున్న అప్పు కట్టాలంటూ బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని హరిత వర్షిణి ఉరివేసుకుని ఆత్మాహత్యకు పాల్పడింది. ఇటీవల రిలీజైన ఎంసెట్ ఫలితాల్లో వర్షిణి 15 వేల ర్యాంక్ సాధించింది. పైచదువులు చదవడానికి ఇంట్లో డబ్బులేక, తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో బ్యాంకు అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేకపోయింది.
బుధవారం వర్షిణి ఇంటికి బ్యాంక్ అధికారులు పలుసార్లు వచ్చారు. డబ్బులు కట్టాలంటూ అవమానకరంగా మాట్లాడడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో తల్లికి ఓ లెటర్ రాసి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ''డాడీ డబ్బులు పంపుతాడో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది కదమ్మ. అందుకే చనిపోతున్నా. ఎవరైనా అడిగితే ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని అందుకే చనిపోయిందని చెప్పు'' అని సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వర్షిణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.