ప్రేమోన్మాది ఘాతుకానికి మ‌రో విద్యార్థిని బ‌లి

Stalker kills Girl Brutally in Nellore.నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి మ‌రో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 2:32 AM GMT
ప్రేమోన్మాది ఘాతుకానికి మ‌రో విద్యార్థిని బ‌లి

నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది ఘాతుకానికి మ‌రో విద్యార్థిని బలైంది. ఓ ప్రేమోన్మాది తన ప్రేమికురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. అనంత‌రం అత‌డు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం క‌ల‌క‌లం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు..గూడూరులోని తిరుపతి రైల్వేలైన్‌ గేటు సమీపంలో పల్లెపాటి సుధాకర్, సరిత దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరూ ఉపాధ్యాయులు. వీరికి ఇంజనీరింగ్‌ చదువుతున్న తేజస్విని, పదో తరగతి చదువుతున్న కుమారుడు సంతానం.

సుధాక‌ర్ స‌హ‌చ‌ర ఉద్యోగి అయిన చెంచుకృష్ణ‌య్య కుమారుడు వెంక‌టేష్‌కు, తేజ‌స్విని ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఏడాదిగా వెంక‌టేష్ ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిన తేజ‌స్విని విష‌యాన్ని పెద్ద‌ల‌కు చెప్పారు. ఈ నేప‌థ్యంలో వెంక‌టేష్ ను బెంగ‌ళూరు పంపారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది మొద‌ట్లో వెంక‌టేష్ గూడూరు వ‌చ్చి ఇక్క‌డే ఉంటున్నాడు. మ‌ళ్లీ ప్రేమ పేరుతో తేజ‌స్విని వేదించ‌డం మొద‌లుపెట్టాడు. దీంతో తేజ‌స్విని త‌న ఫోన్ నెంబ‌ర్‌ను మార్చివేసింది.

యువతి తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు వెళ్లగానే.. వెంకటేష్‌ ఆమె ఇంటికి వచ్చాడు. తేజస్విని సోదరుడు తలుపు తీయగానే అతడిని నెట్టేసి లోపలికి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి గడియ పెట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ వెంకటేష్‌.. తేజస్విని గొంతులో కత్తితో పొడిచి, ఆపై టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. కాగా.. యువ‌తి సోద‌రుడి కేక‌ల‌తో ఇరుగుపొరుగు అక్క‌డికి చేరుకున్నారు. దీంతో భ‌య‌ప‌డ్డ వెంట‌క‌టేష్ చీర‌తో కిటికీ ఉరేసుకున్నాడు. ఈ లోపు స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే తేజ‌స్విని మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్థారించారు. వెంక‌టేష్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు త‌ర‌లించారు. యువ‌తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it