దారుణం..మద్యానికి రూ.100 ఇవ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తండ్రి రూ.100 ఇవ్వలేదని కర్రతో కొట్టి హత్య చేశాడు.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2023 7:25 AM IST
son, murder, Father, nalgonda, chintapalli,

దారుణం..మద్యానికి రూ.100 ఇవ్వలేదని వృద్ధుడిని చంపిన కొడుకు

మద్యానికి బానిసై చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి వద్ద డబ్బులు లేకపోతే ఇంట్లో వారిని హింసించి అయినా డబ్బులు లాక్కుని మద్యం తాగుతారు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ 90 ఏళ్ల తండ్రిని హింసించాడు కొడుకు. డబ్బులు ఇవ్వడం లేదంటూ చితకబాదాడు. కుమారుడి దాడిలో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుని పెంచి పెద్దవారిని చేస్తే.. కుమారుడే తండ్రి పాలిటశాపంలా మారాడు. నల్లగొండ జిల్లా చింతలపల్లికి చెందిన మల్లయ్య (90) అనే వృద్ధుడు ఇంటి వద్దే ఉంటున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ జీవితం సాగిస్తున్నారు. అతడి భార్య సాయమ్మ కొంతకాలం ముందు మృతిచెందింది. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు బుగ్గయ్య రోజువారీ కూలీ పనులు చేస్తాడు. అయితే..బుగ్గయ్య భార్య కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు బుగ్గయ్య. అతను పని చేస్తే వచ్చిన డబ్బులు మొత్తం మద్యానికే తగలేసేవాడు.

అతని డబ్బులు సరిపోలేదని.. తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బులను కూడా లాక్కునేవాడు. శుక్రవారం కూడా మద్యం కోసం రూ.100 ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డాడు బుగ్గయ్య. తన దగ్గర డబ్బులు లేని మల్లయ్య చెప్పడంతో కుమారుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తండ్రిపై దాడి చేశాడు. కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దాంతో.. వృద్ధుడు మల్లయ్య తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story