ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో మద్యం మత్తులో ఒక యువకుడు కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని మోతీహరికి చెందిన రాజేష్ (తండ్రి), తన పెద్ద కుమారుడు అమన్‌తో కలిసి గత 20 ఏళ్లుగా మీరట్‌లోని జైల్ చుంగీ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ పాత ఇనుము (Scrap) వ్యాపారం చేస్తూ అక్కడే మున్సిపల్ షాపుల్లో పనిచేస్తున్నారు.
రాజేష్ భార్య అనిత, మరో కుమారుడు అంకిత్, ఇద్దరు కుమార్తెలు ఖుషీ, జూలీ బీహార్‌లో ఉంటున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. అది కాస్తా ముదిరి పెద్ద గొడవగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన అమన్, పక్కనే ఉన్న ఇటుకతో తండ్రి రాజేష్ తల, శరీరంపై బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన రాజేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తండ్రిని కొట్టిన తర్వాత భయాందోళనకు గురైన అమన్, చాకుతో తన మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ లైన్స్ పోలీసులు రాజేష్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడు అమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ తెలిపారు.