ఆలయంలో సాఫ్ట్‌వేరు ఇంజినీరు ఆత్మహత్య
లోన్‌యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన ఓ
By అంజి Published on 26 May 2023 9:15 AM ISTఆలయంలో సాఫ్ట్‌వేరు ఇంజినీరు ఆత్మహత్య
లోన్‌యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు జయరామిరెడ్డి కొడుకు శ్రావణ్‌కుమార్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. సంవత్సర కాలంగా హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు అవసరం పడి లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేయడంతో రూ.3.50 లక్షలు చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు ఆగలేదు. దీంతో శ్రావణ్‌కుమార్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అప్పు కట్టేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రికి చెప్పాడు.
అయితే వారం రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పిన తండ్రి.. అప్పటికే కొంత మేర డబ్బు పంపించాడు. ఈ నెల 26న డబ్బులు ఇచ్చేందుకు తండ్రి ఏర్పాటు చేశాడు. అయితే అంతలోనే శ్రావణ్ కుమార్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తన బంధువుల ఊరైన మొరంపల్లికి వెళ్లాడు. అక్కడి పూతపల్లేశ్వరస్వామి ఆలయంలో కిటికీ కమ్మీలకు ఊరేసుకున్నాడు. గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. మృతుడి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. శ్రావణ్ తన వెంట కొత్తగా కొనుగోలు చేసిన కొడవలిని, కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రావణ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.