ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్ అత్తాపూర్‌లో కూడా ఓ యువతి తనని ప్రియుడు మోసం చేశాడని ఎంతో బాధపడింది. ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 10:52 AM ISTప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువుతున్నాయి. కొందరు బాధను దిగమింగుకుని జీవితంలో ముందుకు సాగుతుంటే.. జీవితం పంచుకోవాలని కలలు కన్నవారే మోసం చేయడంతో బాధను తట్టుకోలేక ఇంకొందరు ఆత్మహత్యలు చేసుంకుటున్నారు. తాజాగా హైదరాబాద్ అత్తాపూర్‌లో కూడా ఓ యువతి తనని ప్రియుడు మోసం చేశాడని ఎంతో బాధపడింది. కుంగిపోయి చివరకు అతను లేకుండా బతకలేక ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఆదితి అనే యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అత్తాపూర్ పరిధిలోని హ్యాపీ హోమ్ ఫార్చూన్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. అయితే.. ఆమె భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ లవ్‌లో ఉండి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ అబ్బాయి మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. జీవితాన్ని ఊహించుకుంది. బతికితే అతనితోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. భరద్వాజ్ యువతిపై కపట ప్రేమను చూపించాడు. ఆమెను సీరియస్‌గా తీసుకోలేదు. ఆ విషయం కొన్నాళ్లకే ఆదితికి తెలిసింది.
అంతేకాదు.. భరద్వాజ్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే చేదు నిజాన్ని తెలుసుకుంది. అతన్ని నిలదీసింది కానీ ఏమీ సీరియస్‌గా కనిపించకపోవడంతో బాధపడింది. భరద్వాజ్ యువతిని వదిలేశాడు. దాంతో.. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక యువతి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మితం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. యువతి ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.