సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పెళ్లైన పది నెలలకే
Software Employee commits suicide in Kukatpally.ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడం
By తోట వంశీ కుమార్ Published on 5 Sept 2021 8:58 AM ISTఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నాన్న తిట్టాడనో, అమ్మ కొట్టిందనో, ప్రేమికులు ఫోన్ ఎత్తలేదనో, తాము కోరుకున్నది జరగలేదనో, దంపతుల మధ్య చిన్న గొడవలకే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. పెళ్లి అనేది నూరేళ్ల పంట. దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అయితే.. ఓ ఉన్నత విద్యావంతురాలు అయి ఉండి కూడా చిన్న గొడవకే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిద్దిపేటకు చెందిన బ్రహ్మానందం, రాజమణి దంపతులు కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్నారు. గతేడాది నవంబర్‌లో వీరి కుమారై ప్రియాంక(25)ను హన్మకొండకు చెందిన మందుగుల అన్వేష్ కు ఇచ్చి వివాహం చేశారు. ప్రియాంక, అన్వేష్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. కరోనా కారణంగా ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి.
తాజాగా.. ఊరికివెళ్లే విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ప్రియాంకను హన్మకొండ రావాల్సిందిగా శుక్రవారం అన్వేష్ కోరాడు. అయితే.. ప్రియాంక అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం ఇద్దరూ చెరో గదిలోకి వెళ్లి నిద్రపోయారు. శనివారం ఉదయం అన్వేష్ నిద్రలేచి చూసే సరికి ప్రియాంక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.