సాఫ్ట్ వేర్ ఉద్యోగి సజీవదహనం
Softwar engineer burnt alive in room.. ప్రస్తుతం అత్యధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. మంత్రాల నెపంతో
By సుభాష్
ప్రస్తుతం అత్యధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. మంత్రాల నెపంతో ఒకరు సజీవదహనమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అత్తింటి వారు సజీవదహనం చేశారు. జిల్లాలోని మల్యాల మండలం బల్వంతపూర్ శివారులో ఉన్న మంజునాథ ఆలయ గదిలో ఈ దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన పాగిళ్ల పవన్ కుమార్ (37) అనే స్టాఫ్ట్ వేర్ ఉద్యోగికి బల్వంతపూర్‌కు చెందిన కృష్ణవేణితో వివాహమైంది. కృష్ణవేని సోదరుడు జగన్ ఇటీవల గుండెపోటుతో మరణించగా, పరామర్శించేందుకు అతని బావ పవన్ వచ్చాడు. గతంలో జగన్, పవన్ కుమార్‌కు మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.
బావమరిది మృతికి పవన్ కారణమని, మంత్రాలతో చంపాడనే అనుమానంతో బావమరిది భార్య సుమలత ఈ దారుణానికి పాల్పడినట్లు మృతుడి భార్య ఆరోపిస్తోంది. తనను వాటర్ తెమ్మని బయటకు పంపి తన భర్తను గదిలో బంధించి పెట్రోలో పోసి నిప్పటించిందని కృష్ణవేణి ఆరోపిస్తోంది. మంటల్లో కాలిపోతుండగా, పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేస్తున్న అతన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా, అప్పటికే పవన్ పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, సీఐ కిశోర్, ఎస్సై నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సజీవదహనంపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.