స్కూల్‌లో పూర్వ విద్యార్థి తుపాకీతో వీరంగం.. కాల్పులు జరపడంతో..
ఓ యువకుడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి గాల్లో కాల్పులు జరిపి విద్యార్థులను, ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేశాడు.
By అంజి Published on 22 Nov 2023 3:25 AM GMTస్కూల్‌లో పూర్వ విద్యార్థితో తుపాకీతో వీరంగం.. కాల్పులు జరపడంతో..
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని పాఠశాలలోకి తుపాకీతో చొరబడిన ఓ పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. నవంబర్ 21, మంగళవారం నాడు ఈ ఘటన జరిగింది. సిబ్బంది, ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థి బెదిరించడంతో గాలిలోకి కాల్పులు జరిపాడు. వివేకోదయం బాలుర ఉన్నత పాఠశాలలో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం త్రిసూర్ ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ విద్యార్థిని త్రిసూర్‌లోని ములాయంకు చెందిన జగన్‌గా గుర్తించారు. నివేదికల ప్రకారం.. అతను ఎయిర్ గన్ ఉపయోగిస్తున్నాడు.
నల్ల చొక్కా ధరించిన జగన్ హయ్యర్ సెకండరీ ప్రిన్సిపల్ గదిలోని కుర్చీపై కాలుపై కాలు వేసుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బ్యాగ్‌లోంచి తుపాకీ తీయడం కనిపించింది. ఈ సమయంలో ప్రిన్సిపాల్ గదిలోని సిబ్బంది గది నుండి బయటకు వెళ్లడం చూడవచ్చు. దీంతో జగన్ తరగతి గదుల్లోకి వెళ్లి గాలిలోకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
జగన్ గతంలో తన పాఠశాలలో ఇబ్బంది సృష్టించడంతో వివేకోదయం పాఠశాలకు మార్చారు. వివేకోదయం పాఠశాలలో ఏడాదిపాటు చదివాడు కానీ 2023లో ఫైనల్ పరీక్షలు రాయలేదు. స్కూల్‌లోకి ప్రవేశించిన జగన్ డ్రగ్స్ తాగి ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
“మేము మా ఆఫీసు పని చేస్తున్నప్పుడు బయటి నుండి ఎవరో లోపలికి రావడం చూశాము. మేము పెద్దగా పట్టించుకోలేదు కానీ అతను సైకిల్ పార్కింగ్ లాట్‌కి వెళ్లి సైకిళ్లను తన్నాడు. అనంతరం ప్రిన్సిపాల్ గదిలోకి ప్రవేశించాడు. మేము తుపాకీని గమనించినప్పుడు, మేము మా సహోద్యోగులకు సమాచారం ఇచ్చాము. వారు పోలీసులను పిలిచారు” అని సిబ్బంది ఒకరు చెప్పారు.
“జగన్ అప్పుడు అన్ని తరగతి గదుల్లోకి ప్రవేశించి చాలాసార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎవరూ గాయపడలేదు, కానీ మేమంతా భయపడ్డాము. అతను ఎవరిపైనా కాల్పులు జరపలేదు, కానీ అతను కోపంగా ఉన్నాడు” అని సిబ్బంది చెప్పారు. పాఠశాలలో చదువుతున్న సమయంలో జగన్ తరగతులకు హాజరు కాలేదని సిబ్బంది తెలిపారు.