విజయవాడలోని రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మతిస్థిమితం లేని ఇద్దరు 15 ఏళ్ల మైనర్ బాలికలపై ఓ యువకుడు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన నడికుదిటి వెంకట్ శ్రీనాథ్ (19)గా పోలీసులు గుర్తించారు. హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న ఈ యువకుడు, బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తినుబండారాలు, ఇతర వస్తువుల ఆశ చూపి లొంగదీసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం, బాధితుల్లో ఒక బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అదే వీధిలో ఉండే మరో మతిస్థిమితం లేని బాలికతో కలిసి ఆమె ఆడుకుంటూ ఉండేది. నిందితుడు వీరిద్దరినీ మభ్యపెట్టి కృష్ణానది సమీపంలోని ఒక పాడుబడిన భవనానికి తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ నెల 15న ఒక బాలిక నీరసంగా ఉండటాన్ని గమనించిన అమ్మమ్మ, వెంటనే తల్లికి సమాచారం అందించింది. తల్లి వచ్చి బాలికను నిలదీయగా, నిందితుడు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విషయాన్ని బయటపెట్టింది.
స్థానికుల ద్వారా నిందితుడి వివరాలు సేకరించిన బాలిక తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.