'ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి'.. భార్య ప్రాణం తీసిన ఉన్మాది.. ఏపీలో దారుణ ఘటన

కడప జిల్లా రాజంపేటలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపాడాల్సిన భర్త, రాక్షసుడిలా మారి ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన తీరు...

By -  అంజి
Published on : 13 March 2026 2:47 PM IST

Rajampet Suicide Case, Husband Records Wife Suicide, Sriram Srinivas Railway Loco Pilot, Domestic Violence Rajampet, Abetment of Suicide Case, Kadapa Crime News

'ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి'.. భార్య ప్రాణం తీసిన ఉన్మాది.. ఏపీలో దారుణ ఘటన

కడప జిల్లా రాజంపేటలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపాడాల్సిన భర్త, రాక్షసుడిలా మారి ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేటలో రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణవేణి, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త శ్రీనివాస్ ఆమెను అడ్డుకోవాల్సింది పోయి, అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడుతుంటే ఆమెను వారించాల్సింది పోయి, "ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి" అంటూ సూచనలు ఇస్తూ రాక్షసానందం పొందాడు. అంతటితో ఆగకుండా, ఆమె ప్రాణాలు తీసుకుంటున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీస్తూ ఉన్మాదిలా వ్యవహరించాడు. భర్త కళ్లముందే కృష్ణవేణి ప్రాణాలు విడవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ అమానుష ఘటన బయటకు పొక్కడంతో కృష్ణవేణి బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నిందితుడు శ్రీనివాస్‌పై దాడికి ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, అతను రికార్డ్ చేసిన వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఒక నిండు ప్రాణం పోతుంటే కాపాడకుండా వీడియో తీసిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story