ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఐస్‌క్రీమ్ అమ్ముతున్నాడనే చిన్న కారణంతో 25 ఏళ్ల యువకుడిని 50 ఏళ్ల వ్యక్తి పట్టపగలే గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడు బాధితుడి తలని శరీరం నుండి వేరు చేయడమే కాకుండా, దానిని తగులబెట్టేందుకు కూడా ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ఘాతుకం చూసి అక్కడున్న వారంతా భయాందోళనలతో పరుగులు తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాబ్లూ అనే యువకుడు తన ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి ప్రతిరోజూ లాగే ఐస్‌క్రీమ్ అమ్ముకోవడానికి వెళ్లాడు. అయితే, అక్కడ ఐస్‌క్రీమ్ అమ్మకూడదని శంకర్ యాదవ్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. బాబ్లూ అక్కడి నుండి వెళ్ళడానికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది.
ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్ యాదవ్, పదునైన ఆయుధంతో బాబ్లూపై దాడి చేసి అతని తల నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని మంటల దగ్గర ఉంచి పాక్షికంగా తగులబెట్టాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. బారాబంకి ఎస్పీ అర్పిత విజయవర్గియా మాట్లాడుతూ.. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేనట్లు కనిపిస్తోందని, చాలా చిన్న కారణానికే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ కిరాతక హత్యతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.