హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన శాడిస్ట్
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో తండ్రి తన కూతురికి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇచ్చినట్టుగానే, మేడ్చల్ జిల్లా పోచారంలో ఓ యువకుడు..
By - అంజి |
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన శాడిస్ట్
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలో తండ్రి తన కూతురికి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇచ్చినట్టుగానే, మేడ్చల్ జిల్లా పోచారంలో ఒక యువకుడు తనతో పెళ్లి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతిపై అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. తనకు ఉన్న ఎయిడ్స్ వ్యాధిని ఆ యువతికి కూడా అంటించాలనే ఉద్దేశంతో, సిరంజి ద్వారా తన రక్తాన్ని ఆమె శరీరంలోకి ఎక్కించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి, ఒక యువతితో వివాహం నిశ్చయమైంది.
అయితే, నిశ్చితార్థం తర్వాత మనోహర్‌తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియడంతో, ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు. తన అనారోగ్యం కారణంగా పెళ్లి ఆగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మనోహర్, సదరు యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెకు కూడా ఆ వ్యాధిని అంటించాలని ఒక క్రూరమైన పథకం వేశాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్, తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె సమ్మతించకపోవడంతో, ముందే సిద్ధం చేసుకున్న సిరంజి ద్వారా తన హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా ఆమెకు ఇంజెక్ట్ చేశాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత యువతికి తీవ్రమైన జ్వరం రావడంతో, తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అసలు విషయం తెలిసిన యువతి, మనోహర్ చేసిన ఘాతుకాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఈ దారుణంపై యువతి తండ్రి చిరంజీవి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక యువతి జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో నిందితుడు వ్యవహరించిన తీరుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.