మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు

శంషాబాద్‌లో మహిళ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. భర్త ఫిర్యాదు ఆధారంగా మృతురాలి వివరాలను కొనుగొన్నారు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 9:22 AM IST
Shamshabad,  Murder Case, Woman identified, Police,

మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం దారుణ సంఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి ఓ మహిళను హత్యచేసి దహనం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. శంషాబాద్‌ శ్రీనివాస్‌ ఎన్‌క్లేవ్‌లో ఇళ్లమధ్య రాత్రి ఒంటి గంట ప్రాంతాలో కాలుతున్న వాసన వచ్చింది. దాంతో.. స్థానికులు నిద్ర లేచి ఏంటా అని బయటకు వచ్చారు. మంటలు కనిపించడంతో అక్కడకు వెళ్లి చూశారు. దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ బాడీ మంటల్లో కాలిపోవడం చూశారు. షాకైన్‌ జనాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోగా మృతదేహం పూర్తిగా కాలిపోయింది.

మహిళ హత్య చిక్కుముడి వీడేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వచ్చి మహిళ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో హత్యకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో ఆమె వివరాలు గుర్తించడం కష్టం అయిపోయింది. తాజాగా మృతురాలి వివరాలు కొనుగొన్నారు పోలీసులు. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాళ్లగూడదొడ్డి ప్రాంతానికి చెందిన పడ్ల మంజూలగా పోలీసులు చెప్పారు.

కాగా.. భార్య మంజూల కడుపునొప్పితో బాధపడిందని.. ఆ కారణంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని ఆమె భర్త లక్ష్మయ్య చెప్పాడు. రెండ్రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంజూల ఎంతకీ తిరిగి ఇంటికి రాలేదని చెప్పాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తన కోసం వెతికానని చెప్పాడు. దాంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు భర్త లక్ష్మయ్య. అతని ఫిర్యాదుతో చనిపోయిన మహిళ మంజూలగా పోలీసులు గుర్తించారు. మృతురాలి కాలివేళ్లకు ఉన్న మెట్టల ఆధారంగా మంజూలగా పోలీసులు నిర్ధారించారు. కాగా.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంజూలను ఎందుకు చంపారు..? సీసీ కెమెరాల్లో పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజిల్‌ తీసుకున్న ఇద్దరు వ్యక్తులకు, మృతురాలికి సంబంధం ఏంటి..? సజీవదహనం చేశారా..? అత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరికొన్ని వివరాలు తెలియనున్నాయని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

Next Story