మాదాపూర్ డ్రగ్స్ కేసు: ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరెస్ట్ అయిన వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది.
By అంజి Published on 1 Sept 2023 1:00 PM ISTమాదాపూర్ డ్రగ్స్ కేసు: ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడి చేసింది. సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు వెంకట్‌పై నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలకు పాల్పడినట్టు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. నిర్మాతలు సి. కల్యాణ్, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్ అధికారినంటూ డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిర్మాతల నుంచి వెంకటరత్నారెడ్డి రూ.30 లక్షలకుపైగా కొట్టేశాడు.
ఒక ఐఆర్‌ఎస్ అధికారినిసైతం పెళ్లి పేరుతో మోసం చేశాడని సమాచారం. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేసి, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నడిపించినట్టు కూడా పోలీసులు తమ విచారణలో తేల్చారు. పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్.. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టిస్తున్నాడని పోలీసులు తేల్చారు. వెంకట్ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గతంలో కూడ వెంకట్ పై వ్యభిచారం నిర్వహించారనే కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.