ఫార్మసీ విద్యార్థిని కేసు.. ప‌థ‌కం ప్ర‌కార‌మే కిడ్నాప్‌, అత్యాచారం

Sensational info on Nagaramr incident.దిశ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే నాగారాంలో మ‌రో యువ‌తి కిడ్నాప్ రాష్ట్రంలో క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 10:04 AM IST
Sensational info on Nagaramr incident

దిశ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే నాగారాంలో మ‌రో యువ‌తి కిడ్నాప్ రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసులు వేగంగా స్పందించ‌డంతో.. బీ ఫార్మ‌సీ విద్యార్థిని ప్రాణాలు నిలిచాయి. కాగా.. పోలీసుల ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నాగారంలోని రాంపల్లి చౌరస్తా దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ అనంతరం లైంగిక దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

కిడ్నాప్‌ ఘటన పథకం ప్రకారమే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. యన్నంపేటకు చెందిన ఆటో డ్రైవర్, అతని ముగ్గురు మిత్రులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధిత విద్యార్థిని(19) మేడ్చ‌ల్‌కు స‌మీపంలోని ఓ క‌ళాశాల‌లో బీ ఫార్మ‌సీ ద్వితియ సంవ‌వ‌త్స‌రం చ‌దువుతోంది. రోజూ కీస‌ర మండ‌లం రాంప‌ల్లి చౌర‌స్తా వ‌ద్ద క‌ళాశాల బ‌స్సు దిగి.. అక్క‌డ‌నుంచి సుమారు 1.5 కి.మి దూరంలో ఉన్న ఆర్ఎల్‌న‌గ‌ర్‌లోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ప్ర‌ధాన నిందితుడు త‌న సెవెన్ సీట‌ర్ ప్యాసింజ‌ర్ ఆటోను రాంప‌ల్లి చౌర‌స్తా దగ్గ‌రున్న అడ్డాలో నిలిపేవాడు. కొన్ని సార్లు ఆ యువ‌తి అత‌డి ఆటోనే ప్ర‌యాణించేది. ఈ క్ర‌మంలో అత‌డి క‌న్ను ఆమెపై ప‌డింది. స‌హ‌చ‌రులైన ముగ్గురు ఆటో డ్రైవ‌ర్ల‌కు ఆమె గురించి స‌మాచారం చెప్పాడు. అదును చూసి కిడ్నాప్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు.

రోజులాగే యువ‌తి బుధ‌వారం కాలేజీకి చెందిన ఒక సీనియర్‌, మరో ఇద్దరు మహిళలతో సాయంత్రం 6.10 గంటలకు ఆటో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లగానే మిగిలిన ముగ్గురు దిగిపోయారు. ఆర్‌ఎల్‌ నగర్‌ వద్ద ఆటో ఆపకుండా ముందుకు పోవడంతో విద్యార్థిని వెంటనే తన తల్లికి ఫోన్‌చేసింది. ఆమె వెంట‌నే బంధువుల‌కు విష‌యం తెలుప‌గా.. వారు వెంట‌నే డ‌య‌ల్ 100 స‌మాచారం అందించారు.

ఆటో కొద్ది దూరం వెళ్ల‌గానే మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ఆటో ఎక్కారు. మ‌రో వ్య‌క్తి ఘ‌ట్‌కేస‌ర్ శివారులో వ్యానులో సిద్దంగా ఉన్నాడు. అక్క‌డ యువ‌తిని బ‌ల‌వంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మ‌త్తుమందు ఇచ్చారు. అందులోనే యువ‌తిపై అత్యాచారం చేశారు. అనంత‌రం ఆమెను హ‌త్య చేసేందుకు య‌త్నించారు. అదే స‌మ‌యంలో పోలీస్ వాహ‌నాల సైర‌న్ మోగ‌డంతో.. పోలీసుల‌కు దొరికితే.. ఎన్‌కౌంట‌ర్ చేస్తార‌నే భ‌యంతో యువ‌తిని చెట్ల పొద‌ల్లో ప‌డేసి వెళ్లిపోయారు. సెల్ ట‌వ‌ర్ లొకేష‌న్ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడ‌ను గుర్తించారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆమెను అన్నోజిగూడ‌లోని ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

సీసీకెమెరాల సాయంతో ఆటోను గుర్తించిన పోలీసులు.. ఆటో డ్రైవ‌ర్ల‌ను ఆరా తీశారు. సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా న‌లుగురి అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు, గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డట్టు విచారణలో వెల్లడించారని చెబుతున్నారు. గతంలో కూడా కొంత మంది మహిళలపై ఇదే తీరుగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు దగ్గర నుంచి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాయంత్రం వారిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.


Next Story