ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం

ఆరిజన్‌ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

By Srikanth Gundamalla
Published on : 29 Jun 2023 6:42 PM IST

Sejal, Suicide Attempt, Hyderabad, MLA Durgam Chinnaiah

ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం

ఆరిజన్‌ డెయిరీ సీఈవో శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై శేజల్ అపస్మారక స్థితిలో పడివున్నారు. ఆమె బ్యాగ్‌లో నిద్రమాత్రలు, సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు పోలీసులు. మధ్యాహ్నం 1:30 గంటలకు పెద్దమ్మగుడి దగ్గర శేజల్‌ ఆదినారాయణ అనే వ్యక్తి వదిలివెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న శేజల్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మాదాపూర్‌ వద్ద రోడ్డుపై శేజల్ నిద్రమాత్రలు మింగినట్లు పోలీసులు తెలిపారు.

ఆరిజన్‌ డెయిరీ సీఈవో శేజల్‌ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కూడా కొద్దిరోజుల క్రితం శేజల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. తెలంగాణ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొంది. సూసైడ్‌ నోట్‌లో శేజల్‌ సంచలన విషయాలు చెప్పారు. 6 నెలల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనని లైంగికంగా వేధించారని శేజల్‌ ఆరోపిస్తోంది.

సూసైడ్‌ నోట్‌లో శేజల్‌ ఇలా రాసుకొచ్చింది.. "ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పుడు మంత్రి కేటీఆర్ కలిశారు. దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పుడు కేటీఆర్‌తో పాటు పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. దుర్గం చిన్నయ్యపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నన్ను హైదరాబాద్ వెళ్లిపోవాలని చెప్పారు. వారం రోజులకు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కానీ మొన్న కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు నాకు నమ్మకద్రోహం చేసినట్లు అనిపించింది. నాపై లైంగిక దాడి జరగలేదని చెప్పారు. నన్ను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడు నన్ను చంపుతారో తెలియదు. పెద్దమ్మతల్లి నన్ను కాపాడమ్మ" అని శేజల్‌ తన సూసైడ్‌ నోట్‌ రాసింది. ప్రస్తుతం శేజల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Next Story