కీచ‌కోపాధ్యాయుడు.. స్పెల్లింగ్స్ నేర్పుతాన‌ని పిలిచి..

School director booked for molesting girls in Rajkot.విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే స‌భ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2021 2:10 PM IST
కీచ‌కోపాధ్యాయుడు.. స్పెల్లింగ్స్ నేర్పుతాన‌ని పిలిచి..

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే స‌భ్య స‌మాజానికి త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో చెడ్డ పేరు తెస్తున్నారు. కొద్ది మంది ఉపాధ్యాయులు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుతో ప‌విత్ర‌మైన ఉపాధ్యాయ వృత్తికే మాయ‌ని మ‌చ్చ తెస్తున్నారు. కామంతో క‌ళ్లు మూసుకుపోయి తాము విద్యాబుద్ధులు నేర్పి భావిభార‌త పౌరుల‌ను త‌యారు చేసే బాధ్య‌త‌ను విస్మ‌రించి.. అదే విద్యార్థుల‌పై లైంగిక‌ దాడులకు పాల్ప‌డుతున్నారు. స్పెల్లింగులు నేర్పిస్తాన‌ని చెప్పి ఓ పాఠ‌శాల డైరెక్ట‌ర్ ఇద్ద‌రు విద్యార్థినుల‌ను గ‌దిలోకి పిలిచి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. లోధిక తాలుకాలోని ఓ స్కూల్ డైరెక్టర్‌గా దినేశ్ జోషి ప‌నిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్ద‌రు బాలిక‌ల‌కు స్పెల్లింగ్‌లు నేర్పుతార‌ని త‌న గ‌దిలోకి పిలిచాడు. ఆ మాస్ట‌ర్ వ‌క్ర‌బుద్ది తెలియ‌ని ఆ బాలిక‌లు గ‌దిలోకి వెళ్ల‌గా.. వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఇద్ద‌రు అమ్మాయిల్లో.. ఓ బాలిక ఈ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌తో చెప్పింది. గ‌తంలోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించాడ‌ని వాపోయింది. ఇత‌ర అమ్మాయిల‌తోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తుంటాడ‌ని ఆ బాలిక చెప్ప‌గా.. విష‌యాన్ని మిగ‌తా విద్యార్థినుల త‌ల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దాదాపు వంద మంది త‌ల్లిదండ్రులు లోధిక పోలీస్ స్టేష‌న్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా.. నిందితుడు జోషి భార్య సీమా జోషి బీజేపీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిగా ఉన్నారు.

తన భర్తపై ఫిర్యాదు విషయం తెలుసుకున్న ఆమె.. పోలీస్ స్టేష‌న్‌కు చేరుకుని బాధిత త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసింది. చివ‌రికి బాధిత బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో జోషిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. అయితే.. నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేద‌ని బాధిత బాలిక‌ల త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story