ఆకాశం నుంచి పడ్డ పెట్టెలో అద్బుత శక్తులంటూ మోసాలు, నలుగురు అరెస్ట్
ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె దొరికిందనీ.. దాన్ని విక్రయానికి పెట్టి మోసాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్
By Srikanth Gundamalla Published on 5 March 2024 8:07 AM GMTఆకాశం నుంచి పడ్డ పెట్టెలో అద్బుత శక్తులంటూ మోసాలు, నలుగురు అరెస్ట్
కొందరు కేటుగాళ్లు కొత్త కొత్త ప్లాన్లతో అమాయకులను మోసాలు చేస్తున్నారు. చిత్రవిచిత్రమైన ఐడియాలు వేసి డబ్బులను స్వాహా చేస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మోసపోయామని గుర్తిస్తున్న అమాయకులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కూడా నలుగురు సభ్యుల ముఠా కొత్త రకం మోసానికి తెరలేపింది. ఆకాశం ఉంచి ఉల్కలు పడిన సమయంలో ఓ మంత్రపు దొరికిందనీ.. దాంట్లో అద్బుత శక్తులు ఉన్నాయంటూ చెప్పారు. దాన్ని అమ్మకానికి పెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు.. జైలు పాలయ్యారు. ఈ మోసానికి పాల్పడ్డ నలుగురు నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటోన్న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన కేతావత్ శంకర్, నారాయణపేట జిల్లా సంఘంబండకు చెందిన ఖాసీ, తాండూరుకి చెందిన మహ్మద్ అజార్, హయత్‌నగర్‌లో ఉంటోన్న నల్లగొండ జిల్లా డిండికి చెందిన కొర్ర గాసిరాం నలుగురు కలిసి ఆటోలో హైదరబాద్ నుంచి వరంగల్ వైపు బయల్దేరారు. పెంబర్తి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. దాంతో.. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండటాన్ని గమనించిన నలుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. దాంతో.. అలర్ట్ అయిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మంత్రపు పెట్టే అని చెప్పి వరంగల్‌కు చెందిన ఓ వ్యాపారికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారనీ విచారణలో తేలింది. అందులో అద్భుత శక్తులు ఉన్నాయనీ.. ఆ పెట్టే ఆకాశం పైనుంచి పడిందని సదురు వ్యక్తిని నిందితులు నమ్మించారు. అయితే.. రూ.50 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్లు పోలీసులు గుర్తించారు. మంత్రపు బాక్సు అని చెబుతున్న పెట్టెలో బ్యాటరీని అమర్చినట్లు తేలింది. పెట్టెవద్ద అయస్కాంతం పెట్టగానే వైబ్రేట్ అయ్యేలా సెట్ చేశారు. ఇనుప వస్తువు రాయగానే నిప్పు రవ్వలు ఎగిరిపడేలా పెట్టెను తయారు చేశారు. వీటిని తామే తయారు చేసి పలువురిని మోసం చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఆటో, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక పెట్టెను స్వాధీనం చేసుకున్నామన్నారు.