నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి హామీ పనుల అధికారిపై సర్పంచ్ పెట్రోల్ దాడికి పాల్పడడం సృష్టించింది. జిల్లాలోని కుబీర్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజు పై పెట్రోల్ పోసి నిప్పటించారు సర్పంచ్ సాయినాథ్ కుబీర్.
వివరాల్లోకి వెళితే.. కుబీరు మండలం పాత సాంవ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ మంగళవారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కార్యాలయానికి వచ్చాడు. టెక్నికల్ అసిస్టెంట్ రాజును మస్టర్లపై సంతకాలు చేయాలని కోరాడు. కూలీలు చేయని పనులను తానెలా సంతకం చేస్తానని ఆయన నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. సర్పంచ్ ముందస్తు పథకం ప్రకారం తనతో పాటు సీసాలో తెచ్చుకున్న పెట్రోలును రాజుపై పోసి నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో రాజు రెండు చేతులు, చాతీ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. టేబులు మీద ఉన్న పలు ఫైల్స్ కాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన రాజును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.