విషాదం.. ఏడు అడుగులు వేసిన ఏడు రోజులకే
Samarlakota bride commits suicide.ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. కాళ్లకు ఉన్న పారాణి ఇంకా ఆరనే లేదు.
By తోట వంశీ కుమార్ Published on 6 July 2021 7:55 AM ISTఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. కాళ్లకు ఉన్న పారాణి ఇంకా ఆరనే లేదు. పెళ్లికి కట్టిన తోరణాలు వాడలేదు. ఆ ఇంట ఇంకా పెళ్లి సందడి ఆగలేదు. అయితే.. ఏం జరిగిందో తెలీదు కానీ.. ఏడు అడుగులు వేసిన ఏడు రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లో వెళితే.. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన మేనమామ వరుస అయిన కనుమురెడ్డి అశోక్‌తో జూన్ 29న వివాహం జరిపించారు.
అశోక్.. తాపీ పని చేస్తుంటాడు. ఈ మధ్యనే అతను కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక స్వాతిని వివాహం చేసుకున్నాడు. కొత్త జంట రెండు రోజుల కిందట గాదరాడ వచ్చారు. ఆషాఢమాసం వస్తుండటం.. సోమవారం మంచిరోజు కావడంతో.. సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ ఏర్పాట్లలో మునిగి ఉండగా.. స్వాతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి మరణించిందని తెలుసుకున్న అశోక్ ఒక్కసారిగా కుప్పకూలాడు.
కాగా.. ఇరు కుటుంబాలు దగ్గరి బంధువులే కావడంతో స్వాతి విషయం బయటకు రాకుండా రాజీ పడ్డారు. అయితే.. బంధువుల్లో ఓ వ్యక్తి 100కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహానికి తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.