కారులో రూ.5లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..సీసీ కెమెరాల్లో రికార్డు
నల్లగొండ జిల్లాలో కూడా ఓ ఇద్దరు దొంగలు కారులో ఉన్న రూ.5లక్షలను కొట్టేశారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 10:34 AM ISTకారులో రూ.5లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..సీసీ కెమెరాల్లో రికార్డు
నల్లగొండ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పట్టపగలే దొంగతనానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పట్టణాల్లో రోజురోజుకీ దొంగలు రెచ్చిపోతున్నారు. వాహనాలను ఎత్తుకెళ్లడం.. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడటం.. రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు చేయడం చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు కొందరు దొంగలు పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎటువైపు నుంచి వచ్చి దొంగతనం చేస్తారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లాలో కూడా ఓ ఇద్దరు దొంగలు దర్జాగా బైక్ పై వచ్చి ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా ఐదు లక్షల రూపాయలు తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడడంతో దొంగల వ్యవహారం కాస్త బయట పడింది.
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల గ్రాండ్ శ్రీ హోటల్ ముందు ఓ వ్యక్తి కారు ఆపి హోటల్‌లోకి వెళ్లాడు. అంతలోనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. వారికి కారులో డబ్బులు ఉన్న సంగతి ఎలా తెలుసో తెలియదు కానీ.. నేరుగా కారు దగ్గరకు వెళ్లి అద్దాలను పగలగొట్టారు. ఆ తర్వాత అందులో ఉన్న రూ.5లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. కారు యజమాని హోటల్‌లో తిన్నాక కాసేపటికి బయటకు వచ్చాడు. కారు అద్దాలు పగిలిఉండటం చూసి షాక్ అయ్యారు. తీరా అందులో రూ.5లక్షలు ఉంచిన బ్యాగ్ మిస్ అవ్వడంతో దొంగతనం జరిగిందని గ్రహించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి దర్జాగా వ్యవహరిస్తూ కారు అద్దాలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దృశ్యాలను చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. కారులో డబ్బులు ఉన్న విషయం తెలిసినవారే ఈ పనికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఆధారంగా చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.