Hyderabad: రూ.కోటి పైచిలుకు విలువైన గంజాయి పట్టివేత
రూ.కోటికి పైచిలుకు విలువైన గంజాయిని పట్టుకున్నారు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 6:07 PM ISTHyderabad: రూ.కోటి పైచిలుకు విలువైన గంజాయి పట్టివేత
పుష్ప సినిమాను డైరెక్టర్ ఏమి ఇన్స్పిరేషన్తో తీశాడో తెలియదు కానీ.. గంజాయి స్మగ్లర్లు మాత్రం పుష్ప ఉన్న సినిమాలో హీరో మాదిరిగానే పోలీసుల చేతికి చిక్కకుండా గంజాయిని వింత వింత మార్గంలో సరఫరా చేస్తూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. కానీ ఇటువంటి ముఠాలకు చెక్ పెట్టేందుకే ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి ఎప్పటికప్పటికీ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. మల్కాజిగిరి ఎస్ఓటి బృందం కీసర పోలీసులతో కలిసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి రూపాయల పైచిలుకు విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని రాచకొండ సిపి డిహెచ్ చౌహాన్ వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మోహన్ రాథోడ్ (25), హైదరాబాదులోని నాచారం మల్లా పూర్ కు చెందిన పెద్ద బాబురావు (30), సికింద్రాబాద్ లాలాపేట్ కి చెందిన మద్దెల రమేష్ (27), ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంతోష్, బహుల్యా లీలావతి, గోపాల్ ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బహుల్యా లీలావతి, గోపాల్ సంతోష్, మోహన్ రాథోడ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గంజాయి సరఫరాదారులతో మంచి పరిచయాలను కలిగి ఉన్నారు. వీరంతా కలిసి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీకి గంజాయి సరఫరా చేసేందుకు పథకం వేశారు. పథకం ప్రకారమే వీరందరూ కలిసి ఒరిస్సా కి వెళ్లి 430 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం పోలీసులకు ఏమాత్రం అనుమానం కలగకుండా 8 ఇనుప పిల్లర్ బాక్స్ లలో గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టి, బోల్డ్ లను ఉపయోగించి వాటిని టిన్ లతో మూసివేసి తర్వాత వెల్డింగ్ చేశారు.అనంతరం బాహుల్య లీలావతి గంజాయి నింపిన పెట్టాలను హైదరాబాద్కు రవాణా చేయడానికి బాబురావుకు పని అప్పగించాడు. దీంతో బాబురావు తన స్నేహితుడు మద్దెల రమేష్ తో కలిసి గూడ్స్ క్యారియర్లో ఒడిస్సా కు వెళ్లి గంజాయి నింపిన ఇనుప పిల్లర్ బాక్స్‌లను వాహనంలో అప్లోడ్ చేసి తన స్నేహితుడు రమేష్ తో పాటు మోహన్ రాథోడ్ తో కలిసి బాబురావు తిరిగి హైదరాబాదుకు వస్తున్న సమయంలో మల్కాజిగిరి ఎస్ఓటి బృందానికి విశ్వసనీయమైన సమాచారం రావడంతో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
అనుమానస్పదంగా కనిపించిన రెండు వాహనాలను నిలిపి తనిఖీ చేస్తుండగా కేవలం ఇనుప పిల్లర్ బాక్సులు మాత్రమే కనిపించాయి. గంజాయి ఎక్కడ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇనుప పిల్లర్ బాక్సులను ఓపెన్ చేసి చూడగా అందులో భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఒకవైపు పోలీసులు తనిఖీలు చేస్తుండగా... మరోవైపు ముగ్గురు నిందితులు పరారయ్యారు. మోహన్ రాథోడ్, రమేష్, బాబురావు లను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 430 కిలోల గంజాయి ప్యాకెట్లు, ఒక వాహనం, 8 ఐరన్ పిల్లర్ బాక్సులు, రూ.2,170 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లో మొత్తం ఒక కోటి 11 లక్షల రూపాయల విలువగల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించనున్నామని రాచకొండ సిపి డిహెచ్ చౌహాన్ వెల్లడించారు.