రూ.52లక్షలు చెల్లించినా.. దక్కని యువ వైద్యురాలి ప్రాణం
RS 52 lakh fee a young lady doctor dies.ఆ దంపతులు ఇద్దరూ డాక్టర్లే. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరగా..
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 9:11 AM GMTఆ దంపతులు ఇద్దరూ డాక్టర్లే. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరగా.. ఆ మహమ్మారిని విజయవంతంగా జయించారు. అయితే.. భార్యకు కరోనా అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యం కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. రూ.52లక్షల బిల్లు వసూలుచేశారు. అడినంతా ఇచ్చినా కూడా.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని డాక్టర్ అయిన ఆమె భర్త ఆరోపిస్తూ.. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
హైదరాబాద్ శివారు కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ కల్యాణ్‌తో వివాహమైంది. భావన పెళ్లికి ముందు బేగంపేట సమీపంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో రేడియాలజిస్టుగా పనిచేసింది. అయితే.. వివాహాం అనంతరం ఆమె తన వృత్తికి దూరంగా ఉంటోంది. అయితే.. ఏప్రిల్ లో కరోనా బారినపడటంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఈమహమ్మారిని జయించింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.
26 రోజులుగా అక్కడ చికిత్స పొందుతోంది. మరో వారం రోజుల్లో ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని ఆమె భర్త కల్యాణ్ చెప్పాడు. అయితే.. బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేక రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయినా ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్ స్థాయి 94గా ఉండగా పైపు డ్యామేజ్ కారణంగా 64కు పడిపోయిందని.. ఆ తర్వాత ఫ్లూయిడ్ ఓవర్‌లోడ్ చేయడంతో గురువారం వేకువజామున ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని ఆమె భర్త చెప్తున్నారు.
ఆస్పత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామని.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య ప్రాణాలు కోల్పోయింది కల్యాణ్ ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిల్లో ఉన్న ఆమెను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోయిందని మీడియాకు వెల్లడించింది.