స్కూల్‌ హాస్టల్‌లో దారుణం.. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్‌తో 9వ తరగతి బాలుడు దాడి.. ఒకరు మృతి

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఆదివారం అర్థరాత్రి అత్యంత భయంకరమైన ఘట‌న చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 8 March 2026 11:47 AM IST

Ballari School Hostel Attack, Gurukul International School Ballari, Student Murder Case, Iron Rod Attack Karnataka, VIMS Hospital Ballari, Minor Student Crime, School Safety Karnataka, Hostel Violence Incident

స్కూల్‌ హాస్టల్‌లో దారుణం.. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్‌తో 9వ తరగతి బాలుడు దాడి.. ఒకరు మృతి

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఆదివారం అర్థరాత్రి అత్యంత భయంకరమైన ఘట‌న చోటుచేసుకుంది. ఒక 9వ తరగతి విద్యార్థి ఉన్మాదిలా మారి తోటి విద్యార్థులపై దాడి చేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. బళ్లారి జిల్లాలోని గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో ఆదివారం రాత్రి విద్యార్థులంతా భోజనం ముగించుకుని నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి, పాత గొడవ మనసులో పెట్టుకుని, నిద్రపోతున్న తోటి విద్యార్థులపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.

ఈ దాడిలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు విద్యార్థులు రక్తపు మడుగులో విలవిలలాడారు. అడ్డుకోవడానికి వచ్చిన హాస్టల్ వార్డెన్‌పై కూడా నిందితుడు దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు గాయపడిన విద్యార్థులను వెంటనే బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (VIMS) ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, స్కూల్ యాజమాన్యం ఇది ఇనుప రాడ్‌తో జరిగిన దాడి అని చెబుతుండగా, మరణించిన విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను కత్తితో పొడిచి చంపారని ఆరోపిస్తున్నారు.

నిందితుడైన విద్యార్థి మాదకద్రవ్యాలకు బానిసై ఉండవచ్చని, అసలు హాస్టల్ లోపల ఇంతటి మారణకాండ జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తోందని వారు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్కూల్‌ను సందర్శించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మైనర్ బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం వెనుక అసలు కారణాలేంటి? స్కూల్ భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో బళ్లారి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Next Story