యాప్ ద్వారా కారు అద్దెకు తీసుకొని రోడ్డుపై బీభత్సం
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 8 Sep 2023 6:19 AM GMTయాప్ ద్వారా కారు అద్దెకు తీసుకొని రోడ్డుపై బీభత్సం
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో కారు అత్యంత వేగంగా రోడ్డుపై అటు ఇటు వెళ్తూ బీభత్సం సృష్టించి. బుద్వేల్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మధ్య కాలంలో మైనర్లే ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. వారి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత సూచించినా.. ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా... నలుగురు విద్యార్థులు తమకు పూర్తిగా డ్రైవింగ్ రాకపోయినా.. కారు అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత కారు రోడ్డుపైకి తీసుకొచ్చి బీభత్సం సృష్టించారు. చివరకు ఆస్పత్రి పాలయ్యారు.
రాజేంద్రనగర్‌లో ఒక కారు అత్యంత వేగంగా వస్తూ బుద్వేల్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. విద్యార్థులం దరూ వ్యాలిస్ లైసెన్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని కార్లు అద్దెకు తీసుకుంటున్నారు. విద్యార్థులకు డ్రైవింగ్ వచ్చా లేదా అని తెలుసుకోకుండానే నిర్వాహకులు వారికి కారు అద్దెకి ఇస్తున్నారు. ఈ విధంగా నిర్వాహకులు యాప్స్ ద్వారా అడ్డగోలుగా కార్లు అద్దెకి ఇస్తున్నారు. డ్రైవింగ్ రాకపోయినా కూడా ఇలాంటి యాప్స్ ద్వారా మైనర్లు కార్లను అద్దెకు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదానికి కారకులవుతున్నారని పోలీసులు అంటున్నారు. ఈ నలుగురు విద్యార్థులు కూడా కాలేజీకి బంకు కొట్టి యాప్ ద్వారా కారును అద్దెకు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ షికార్లు కొడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని పోలీసులు చెప్పారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.