సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ బాబును ఓ కుటుంబానికి దత్తత ఇచ్చేశారు. అనంతరం ఆ బాలికకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. వివాహమైన పదేళ్ల తరువాత గ్యాంగ్ రేప్ గురించి తెలిసిన భర్త విడాకులు ఇచ్చేశాడు. మరోవైపు తన తల్లి గురించి తెలుసుకున్న కుమారుడు ఆమె వద్దకు వచ్చాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో తెలుసుకునేందుకు కోర్టును ఆశ్రయించాడు. అత్యాచార నిందితుల్లో ఓ వ్యక్తి అతడి తండ్రిగా డీఎన్ఏ టెస్టులో తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన బాలిక(12) 1994లో తన అక్కాబావ ఇంట్లో ఉండేది. ఆ సమయంలో స్థానికంగా ఉండే యువకులు ఇంట్లోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. 13 ఏళ్ల వయస్సులోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఆ బాబును వేరే కుటుంబానికి దత్తత ఇచ్చేశారు. అనంతరం ఆ బాలికను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పదేళ్ల కాపురం అనంతరం గతంలో తన భార్యపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలియడంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.
ఇంకోవైపు పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి గురించి ఆరా తీయగా జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. తన తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్న అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అత్యాచార నిందితులను గుర్తించి వారికి డీఎన్ఏ టెస్టు చేయించింది. నిందితుల్లో ఒకరైన గుడ్డు 27 ఏళ్ల వ్యక్తి తండ్రిగా తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.