దారుణం..ఫ్రెండ్ అని వెళ్తే యువతిపై భర్తతో అత్యాచారం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 July 2024 7:56 AM IST
దారుణం..ఫ్రెండ్ అని వెళ్తే యువతిపై భర్తతో అత్యాచారం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలు అని నమ్మి వెళ్తే.. భర్తతో అత్యాచారం చేయించింది. గంజాయి అలవాటు చేసి.. భర్త అఘాయిత్యానికి పాల్పడితే సహకరించింది. ఈ క్రమంలో ఆమే ఏకంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. బాధితురాలు, నిందితులు అంతా న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారే కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల క్రితం తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ కోర్సులో చేరింది. హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు పుదిపట్లలో ఉండే సహ విద్యార్థి సదాశివం ప్రణవకృష్ణ (35)తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిశోర్‌తోనూ బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిశోర్ ఇద్దరూ గంజాయికి ఎప్పుడో బానిసలు. ఈ క్రమంలో స్నేహితుల కోసం వస్తోన్న యువతికి కూడా గంజాయిని అలవాటు చేశారు. ఆ తర్వాత ఆమె మత్తులో ఉండగా.. కృష్ణ కిశోర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్‌లో వీడియో తీసింది. వాటితో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ బంగారం నగలు లాక్కున్నారు. వీరి ఆగడాలు అంతటితో ఆగలేదు..ఈ వీడియోలను యువతి సోదరుడు, ఆమె కాబోయే భర్తకు పంపారు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు కుటుంబ సభ్యుల సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులిద్దరినీ అరెస్ట్ చేశారు.