కిరాతకంగా కూతుర్ని చంపి..బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి
పంజాబ్‌లోని అమృత్‌సర్ పరిధిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 5:01 PM ISTకిరాతకంగా కూతుర్ని చంపి..బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి
బంధాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో కొందరు హత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారు, కడుపున పుట్టినవారు అని కూడా చూడటం లేదు. చిన్న తప్పు చేసినా మరణశిక్షే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానంతో ఓ వ్యక్తి కన్న కూతుర్ని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత కూతురు మృతదేహాన్ని బైక్‌కు కట్టి, ఊరంతా ఈడ్చుకెళ్లాడు. పంజాబ్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్ పరిధిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దల్బీర్ సింగ్ ఒక కూలీ. కూలీ పనులు చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. ఇతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఆగస్టు 9న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు స్నేహితురాళ్లను అడిగినా సమాచారం తెలియలేదు. దాంతో కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. మరుసటి రోజే యువతి తిరిగి ఇంటికి వచ్చింది. ఒక రోజు మొత్తం బయటే ఉండటంతో కూతురిపై అనుమానపడ్డాడు తండ్రి దల్బీర్ సింగ్. ఎవరితోనో సంబంధం పెట్టుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అదే కోపంతో కూతురిపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. అడ్డుకోబోయిన మిగతా కుటుంబ సభ్యులను ఇంట్లోని ఓ గదిలో ఉంచి లాక్ చేశాడు. ఆ తర్వాత కుమార్తెపై తీవ్రంగా దాడి చేయడంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత కూతురు మృతదేహాన్ని దారుణంగా బైక్‌కు కట్టి ఊరంతా తిరిగాడు. ఈ క్రమంలో అతనలా మృతదేహాన్ని బైక్ కట్టి ఊర్లో నుంచి వెళుతుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మృతదేహాన్ని బైక్ కట్టి తీసుకెళ్లి.. ఆ తర్వాత రైలు పట్టాలపై పడేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దల్బీర్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశామని.. నిందితుడిని విచారిస్తున్నామని.. మిగతా వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.