ఈ రోజుల్లో గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. తాజాగా 35 ఏళ్ల క్రికెటర్ లైవ్ మ్యాచ్‌లో మరణించాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇమ్రాన్ పటేల్ అనే క్రికెటర్ గుండెపోటుకు గురై మరణించాడు. పుణెలో జరుగుతున్న లీగ్‌లో ఈ క్రికెటర్ మృతి చెందాడు.
ఇమ్రాన్ పటేల్ గార్వేర్ స్టేడియంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగాడు. కొన్ని ఓవర్ల తర్వాత అతను తన ఎడమ చేయి, ఛాతీలో నొప్పి గురించి అంపైర్‌లకు ఫిర్యాదు చేశాడు. తిరిగి పెవిలియన్‌కు వస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు. ఈ దృశ్యాలు మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ సమయంలో కెమెరాకు చిక్కాయి.
గుండెపోటు రావడంతో ఇమ్రాన్ స్పృహ కోల్పోయాడు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఇమ్రాన్ మరణానంతరం అతని సహచరుడు నసీర్ ఖాన్ అతనికి ఏ వ్యాధి లేదని చెప్పాడు. అతని శారీరక స్థితి కూడా చాలా బాగుంది. అతను నిరంతరం క్రికెట్ ఆడేవాడు. అతడు మంచి ఆల్‌రౌండర్, అతని మరణంతో మేమంతా షాక్ అయ్యామని పేర్కొన్నాడు.