నిర్మాత దిల్‌రాజు అల్లుడి కాస్ట్‌లీ కారు చోరీ.. గంట తర్వాత...

దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌ రెడ్డికి చెందిన లగ్జరీ కారుని ఓ వ్యక్తి చోరీ చేశాడు.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 5:33 AM GMT
producer, dil raju, son in law, luxury car, theft,  hyderabad,

నిర్మాత దిల్‌రాజు అల్లుడి కాస్ట్‌లీ కారు చోరీ.. గంట తర్వాత...

దొంగలు రెచ్చిపోతున్నారు. పార్క్‌ చేసిన కార్లు, బైకులను ఎత్తుకెళ్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. అయితే.. తాజాగా కొందరు దొంగలు పగటిపూటనే ఓ లగ్జరీ కారుపై కన్నేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అల్లుడి కారును ఎత్తుకెళ్లారు. దాంతో ఈ సంఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు గంటపాటు శ్రమించి చివరకు కారు ఆచూకీని కనుకొన్నారు. అయితే.. చోరీకి పాల్పడ్డ వ్యక్తికి మతిస్థిమితం లేదని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

దిల్‌రాజు అల్లుడు అర్చిత్‌ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు వెళ్లాడు. తన వద్ద ఉన్న లగ్జరీ కారు పోర్షేలో వెళ్లాడు. దీని విలువ రూ.1.7 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే.. హోటల్‌కు వెళ్లాక కారుని బయట ఉంచి..అర్చిత్‌రెడ్డి లోనికి వెళ్లాడు. ఒక 40 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే తాను ఉంచిన దగ్గర కారు కనపడలేదు. దాంతో.. కంగారుపడ్డ అర్చిత్‌రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. అక్కడున్న సీసీ కెమెరాలను అన్నిటింటినీ పరిశీలించారు. అయితే.. పోర్షే కారు చెక్‌పోస్టు వద్ద రెడ్‌ సిగ్నల్‌ జంప్‌ చేసినట్లు గుర్తించారు. దాంతో.. కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో.. అక్కడి పోలీసులు కారుని గుర్తించి ఆపారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు మాట్లాడిన మాటలతో పోలీసులు షాక్‌ తిన్నారు. తాను ఆకాశ్‌ అంబానీ వ్యక్తిగత సహాయకుడిని అని.. కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని చెప్పాడు. తాను.. తన సహాయకుడు హృతిక్‌రోషన్‌ కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలిసేందుకు వెళ్లాల్సి ఉందని చెప్పాడు. దాంతో.. పోలీసులకు ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఎలాగోలా సదురు వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని సమాచారం ఇచ్చారు. దాంతో.. కారు తీసుకెళ్లిన వ్యక్తికి మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులే నిర్ధారించారు. బ్రైట్‌ లైఫ్‌ ఫౌండేషన్‌లో అతడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. కాగా.. నిందితుడు మన్సూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలియడంతో తిరిగి అతన్ని చికిత్స ఫౌండేషన్‌కు పంపించారు. కాస్ట్‌లీ కారు చోరీ అయ్యిందని కాసేపు పోలీసులు టెన్షన్ పడ్డారు. గంట తర్వాత అది దొరకడంతో రిలాక్స్‌ అయ్యారు.

Next Story