ప్రవళిక సూసైడ్ కేసు: సంచలన విషయాలు చెప్పిన కుటుంబ సభ్యులు
ప్రవళిక ఆత్మహత్య సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 3:53 PM ISTప్రవళిక సూసైడ్ కేసు: సంచలన విషయాలు చెప్పిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రవళిక సూసైడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడటంతోనే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ పలువురు ఆందోళనలు చేశారు. రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక అదే చివరకు స్పందించిన పోలీసులు ఆత్మహత్య సంఘటపై క్లారిటీ ఇచ్చారు. ప్రవళిక ప్రేమ వ్యవహరం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు.
అయితే.. తాజాగా ప్రవళిక ఆత్మహత్య సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె తల్లి మర్రి విజయ మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి ప్రవళికను హైదరాబాద్‌లో ఉంచి చదివించుకుంటున్నానని చెప్పారు. తన కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడని చెప్పింది. నానా ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ పిల్లలు చదివిస్తున్నామని చెప్పింది ప్రవళిక తల్లి. కానీ.. తన కూతురి చావుకు శివరామ్ అనే యువకుడు కారణమని తెలిపింది. తన పిల్లలను వేధించాడని వాపోయింది. అతడి టార్చర్ భరించలేకే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి కన్నీరుపెట్టుకుంది. తన కూతురు చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని.. జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ఆమె కోరింది. ఇక తమ కూతురి సూసైడ్‌ను రాజకీయాల్లోకి లాగొద్దని కోరింది. పార్టీల మధ్య గొడవలుంటే వారువారు చూసుకోవాలని చెప్పింది ప్రవళిక తల్లి విజయ.
అక్క ప్రవళిక ఆత్మహత్య ఘటనపై తమ్ముడు ప్రణయ్ మాట్లాడాడు. ప్రవళిక హాస్టల్‌కు తన హాస్టల్‌కు 5 నిమిషాల్లో వెళ్లేంత దూరమే ఉంటుందని చెప్పాడు. వారానికి 3, 4 సార్లు తన అక్కని కలుస్తానని చెప్పాడు. శివరామ్ అనే వ్యక్తి ప్రవళికను వేధించాడని ప్రణయ్ చెప్పాడు. హాస్టల్‌కు వచ్చి అందరి ముందు మాట్లాడాలని ఇబ్బంది పెట్టేవాడని తెలిపాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదని.. ఇంట్లో చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని మనస్తాపం చెందింది అని అన్నాడు ప్రణయ్. డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నాడు. ప్రవళికను శివరామ్ ఇబ్బంది పెట్టేవాడని.. ఏడిపించేవాడని.. ఇతరుల నెంబర్స్ నుంచి కాల్స్ చేసేవాడని తెలిపాడు. తన అక్కడ ఆత్మహత్యకు కారణమైన శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ డిమాండ్ చేశాడు. వేధింపుల వల్లే తన చనిపోయిందని.. ఏ పార్టీ వారు వచ్చి తమని ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా ప్రవళిక తమ్ముడు ప్రణయ్ కోరాడు.