బాలికను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు!

కడప జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజామున...

By -  అంజి
Published on : 11 April 2026 7:27 AM IST

Kadapa Police Firing, Minor Girl Murder Case, Venkatesh Accused Arrest, Khajipet Murder Investigation, RIMS Kadapa Hospital, Police Encounter in Andhra Pradesh, Love Obsession Murder

బాలికను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతుకోసి దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. శనివారం తెల్లవారుజామున మైదుకూరు నుంచి నిందితుడిని వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, అతడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచి పారిపోతుండగా, పోలీసులు మొదట గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిందితుడు ఎదురు తిరగడంతో, పోలీసులు నిందితుడి కాళ్లపైకి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను వెంటనే కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను, ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై నిరంతరం ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న వెంకటేశ్‌, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దాడి చేశాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె తిరస్కరించడంతో, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి తండ్రి శ్రీనివాసులు హుటాహుటిన రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో చెన్నూరు వద్ద ఆమె ప్రాణాలు విడిచింది. చనిపోయే ముందు ఆ బాలిక తన తండ్రికి వెంకటేశ్, ప్రవీణ్‌ల పేర్లను చెప్పి తనను చంపింది వారేనని ధ్రువీకరించింది. మిగతా విషయాలు చెప్పడానికి ప్రయత్నించినా.. మాట్లాడలేకపోయింది.

Next Story