విషాదం.. పెళ్లైన 4 నెలలకే కానిస్టేబుల్ ఆత్మహత్య
Police constable Suicide .రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో పెళ్లైన నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
By తోట వంశీ కుమార్ Published on
30 March 2021 7:43 AM GMT

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సైదులు(25) మర్రిగూడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి గతేడాది నవంబర్‌లో పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. అయితే.. భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు చేసుకునేవి అని తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి అలాగే బయటకు వచ్చేశాడు.
ఇంటి నుంచి బయటకు వచ్చిన సైదులు తిరుమలేశుని గుట్ట సమీపానికి చేరుకున్నాడు. ఓ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story