బెంగళూరులో రేవ్ పార్టీ.. సంచలన విషయాలు వెల్లడించిన కమిషనర్‌

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్టిస్ట్‌ హేమ .. రేవ్‌ పార్టీలో పాల్గొన్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ తెలిపారు.

By అంజి  Published on  21 May 2024 10:34 AM GMT
Bangalore Police Commissioner, Bangalore, Rave Party

బెంగళూరులో రేవ్ పార్టీ.. సంచలన విషయాలు వెల్లడించిన కమిషనర్‌

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌ సైడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ .. రేవ్‌ పార్టీలో పాల్గొన్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురుని అరెస్టు చేసినట్లు చెప్పారు. రేవ్‌ పార్టీకి సంబంధించిన విషయాలను పోలీసు కమిషనర్ వెల్లడించారు. బెంగళూరులోని నగర శివారు ప్రాంతంలోని ఓ ఫామ్​హౌస్​లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ పార్టీలో ప్రజాప్రతినిధుల ప్రమేయం మాత్రం లేదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. సీసీబీ పోలీసులు, స్థానిక పోలీసులు నగర శివారు ప్రాంతంలో పార్టీ జరుగుతుందని తెలిసి దాడులు నిర్వహించారని కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు.

మత్త పదార్థాలను గుర్తించేందుకు ట్రైన్‌డ్‌ డాగ్ స్వ్కాడ్​ సహాయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నారని, ఈ దాడిలో మత్తు పదార్థాలను గుర్తించామన్నారు. కొందరు తాము వాడుతున్న డ్రగ్స్​ను స్విమ్మింగ్ పూల్​తో పాటు ఇతర ప్రాంతాల్లో విసిరేశారని కమిషనర్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్​లో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశామని, సంఘటన స్థలం బెంగళూరు రూరల్​లోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడకు బదిలీ చేస్తామని కమిషనర్ దయానంద్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. రేవ్‌ పార్టీలో తాను లేనని నటి హేమ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి ఆమె తీశారో తెలియడం లేదని కమిషనర్‌ అన్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అలాగే పార్టీలో పాల్గొన్న వారందరికీ మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నామని, అందుకు సంబంధించిన రిపోర్ట్‌ వచ్చిన వెంటనే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.

ఓ వ్యాపారవేత్త బెంగళూరులో ఇచ్చిన రేవ్ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసులు తెలుసుకుని పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారు. రేవ్ పార్టీలో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన లాంటి మత్తు పదార్థాలను పోలీసులు గుర్తించారు.

Next Story