స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పేరుతో నకిలీ కాల్ సెంటర్‌ని నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. ఎస్‌బీఐ పేరుతో బ్యాంకు అధికారులమని ఫోన్ చేసి పలువురి బ్యాంకు ఖాతాల నుంచి నగదును తస్కరిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఎస్‌బీఐ కాల్‌సెంటర్ పేరుతో కేవైసీ, క్రెడిట్ కార్డులు, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కాల్‌సెంటర్‌పై సమాచారం అందుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 'ధని లోన్ బజార్' కాల్‌సెంటర్‌పై దాడులు చేశారు. మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. కాల్‌సెంటర్‌కు చెందిన వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును సీజ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించారు.
దీనిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఇది దేశంలోనే అతి పెద్ద సైబర్ మోసం అని అన్నారు. ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 33 వేల ఫోన్లకు ఫోన్ చేసి వందల కోట్ల రూపాయాలు మోసానికి పాల్పడ్డారని చెప్పారు. 14 మందిని అరెస్టు చేసి 30 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల ద్వారా ఖాతాదారుల వివరాలను సేకరించి మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఫర్మాన్ హుస్సేన్ ఈ కేసులో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు.