పిస్టోల్‌ అమ్మేందుకు వ్యక్తి యత్నం..పోలీసుల ఎంట్రీ..చివరకు

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పిస్టోల్‌ అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  10 July 2023 3:48 PM IST
Pistol Seize, Hyderabad, LB Nagar, Police,

 పిస్టోల్‌ అమ్మేందుకు వ్యక్తి యత్నం..పోలీసుల ఎంట్రీ..చివరకు

గుట్టుచప్పుడు కాకుండా చీకటి దందా చేస్తున్న వారిపై పోలీసులు ఎప్పుడూ నిఘా పెట్టి ఉంచుతారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పిస్టోల్‌ అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అతను షాక్‌ అయ్యాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ కంట్రీ మేడ్‌ గన్‌ను విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాని సమాచారం అందింది పోలీసులకు. దాంతో.. అన్సారీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గమనించారు. దాంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకే ఎల్‌బీనగర్‌ బస్‌స్టాండ్‌ దగ్గర ఆదివారం నుంచి తనిఖీలు చేపట్టామని ఎల్‌బీనగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ పీసీ వెల్లడించారు. ఈ క్రమంలోనే అన్సారీ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని.. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి రెండు లైవ్‌ రౌండ్స్‌, రెండు ఖాళీ మ్యాజిగిన్‌, కంట్రీ మేడ్‌ పిస్టోల్‌తో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

నిందతుడు అన్సారీ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌లో కంట్రీ మేడ్‌ గన్ విక్రయించేందుకు ప్రయత్నం చేశాడు. కందుకూరులో ఉన్న తన బంధువుల వద్ద ఉంటూ అన్సారీ డెయిలీ లేబర్‌గా పని చేస్తున్నాడు. కానీ.. ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా తుపాకీ విక్రయం వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ప్రస్తుతం నిందితుడు అన్సారీ తమ అదుపులో ఉన్నాడని.. పిస్టోల్‌ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు..? దీని వెనుక ఎవరున్నారు? హైదరాబాద్‌లో పిస్టోల్‌ ఎవరికి విక్రయించేందుకు వచ్చాడు? అనే దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గన్‌ విక్రయించేందుకు వ్యక్తి ప్రయత్నించాడన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది.

Next Story