ఆన్‌లైన్ అప్పుల బాధతో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా మొదలైన అలవాటు అప్పుల ఊబిలోకి నెట్టడంతో...
By - అంజి |
ఆన్‌లైన్ అప్పుల బాధతో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
ఆన్‌లైన్ గేమ్స్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా మొదలైన అలవాటు అప్పుల ఊబిలోకి నెట్టడంతో, వాటిని తీర్చలేక ఓ విద్యార్థి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. ఒడిశా రాష్ట్రం నావ్‌పాడకు చెందిన మహ్మద్ బషీర్ (22), కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన బషీర్, వివిధ యాప్స్ ద్వారా భారీగా అప్పులు చేసి తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బషీర్ తన తల్లికి రాసిన ఆఖరి లేఖ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. "అమ్మా నన్ను క్షమించు.. నీకు మంచి కొడుకుగా ఉండలేకపోయాను. నువ్వు నా కోసం ఎంతో కష్టపడ్డావు, కానీ నేను నీకు భారం అవుతున్నానని అనిపిస్తోంది. నా జీవితంలో ఏదీ సరిగ్గా జరగడం లేదు, నాకు వేరే మార్గం కనిపించడం లేదు" అంటూ ఆవేదనతో లేఖ రాశాడు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్న బషీర్, ఉన్నత చదువుల కోసం కాకినాడ వచ్చి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తండ్రి షమీర్ ఖాన్, తల్లి పర్వీన్ బేగమ్ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొడుకును చదివిస్తున్నారు. బషీర్ మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్, లోన్ యాప్స్ పట్ల యువత, ముఖ్యంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.