విషాదం.. త‌న చితిని తానే పేర్చుకుని వృద్దుడి ఆత్మ‌హ‌త్య‌

Old man commits suicide in Siddipet dist.సిద్దిపేట జిల్లా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామం వేముల‌ఘాట్‌లో విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 8:00 AM GMT
విషాదం.. త‌న చితిని తానే పేర్చుకుని వృద్దుడి ఆత్మ‌హ‌త్య‌

సిద్దిపేట జిల్లా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ముంపు గ్రామం వేముల‌ఘాట్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్లన్న సాగర్‌లో ఇళ్లు కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధుడు చితి పేర్చుకుని, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న తొగుట గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. తొగుట మండలం వేములగాట్‌కు చెందిన తుటుకూరి మల్లారెడ్డి( 70) భార్య చ‌నిపోవ‌డంతో ఒంట‌రిగా ఉంటున్నాడు. కూతురి కుమారుడు(మనవడు) అప్పుడప్పుడు తాత దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొద్ది నెల‌ల క్రితం అత‌డు ఉంటున్న ఇంటి జాగా మొత్తం మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపథ్యంలో మృతుడు డబుల్‌ బెడ్‌ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఇంటిని ఖాళీ చేయించారన్న మనో వేదనతో గురువారం అర్థరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని అందులోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శ‌రీర భాగాల‌ను పోస్టుమార్టానికి పంపించారు. మ‌ల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it