ట్రాక్ట‌ర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటు మీ ద‌గ్గ‌ర ఉందా..? అయితే.. మీరు ల‌క్షాదికారే..?

Old Five Rupee Note fraud case in nizamabad.డ‌బ్బు మీద మ‌నిషికి ఉన్న ఆశ కుదురుగా ఉండ‌నివ్వ‌డం లేదు. ఉత్తిపుణ్యానికే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 1:22 PM IST
ట్రాక్ట‌ర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటు మీ ద‌గ్గ‌ర ఉందా..? అయితే.. మీరు ల‌క్షాదికారే..?

డ‌బ్బు మీద మ‌నిషికి ఉన్న ఆశ కుదురుగా ఉండ‌నివ్వ‌డం లేదు. ఉత్తిపుణ్యానికే డ‌బ్బులు వ‌స్తాయ‌ని ఎవ‌రైనా చెబితే.. అనుమానించాల్సి ఉండ‌గా.. అత్యాశ‌కు పోయి ఉన్న‌వి పొగ్గొట్టుకున్న సంఘ‌ట‌న మ‌నం అనేకం చూశాం. అయిన‌ప్ప‌టికి కొంద‌రు మ‌ళ్లీ మ‌ళ్లీ మోస‌పోతూనే ఉన్నారు. తాజాగా.. మీ వ‌ద్ద పాత ఐదు రూపాయ‌ల నోటు ఉందా.. ఆ నోటు వెన‌కాల ట్రాక్ట‌ర్ బొమ్మ ఉందా..? అయితే.. ఆ నోటు మాకిస్తే.. మీకు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌ని న‌మ్మించి ఓ వ్య‌కిని నిలువుదోపిడి చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో క‌స్తూరి న‌ర్సింలు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డికి ఈ నెల 1(ఏప్రిల్ 1)న గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. మీ ద‌గ్గ‌ర ట్రాక్ట‌ర్ బొమ్మ ఉన్న పాత రూ.5 రూపాయ‌ల నోటు ఉంటే.. మీకు రూ.11.74ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌నేది ఆ కాల్ సారాంశం. తొలుత అనుమానం వ‌చ్చినా.. వారి చెప్పిన మాట‌ల‌ను న‌ర్సింలు న‌మ్మాడు. త‌న వ‌ద్ద అలాంటి నోటు ఉంద‌ని.. అది ఎలా ఇవ్వాల‌ని అడిగాడు.

అయితే.. ముందుగా అకౌంట్‌ ఓపెన్‌ చేయాలని.. ఎన్‌వోసీ అని, ఐటీ క్లియరెన్స్‌ అని మోసగాళ్లు పలు దఫాలుగా డబ్బులు పంపించమన్నారు. నిజమే కావచ్చని నమ్మిన నర్సింలు పది విడతల్లో మొత్తం రూ. 8.35 లక్షలు వారు చెప్పిన అకౌంట్ల‌లో వేశాడు. అయిన‌ప్ప‌టికి వారు డ‌బ్బులు పంపిచ‌క పోగా.. మ‌రింత న‌గ‌దును పంపించాల‌ని కోరారు. దీంతో అనుమానం వ‌చ్చిన న‌ర్సింలు దేవుని ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి జ‌రిగిందంతా పోలీసుల‌కు చెప్పాడు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్, వాట్సాప్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా మోసగాళ్లు పశ్చిమ బెంగాల్ నుండి కథ నడిపినట్లుగా గుర్తించారు. బంపర్‌ డ్రాలు, బహుమతుల పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని పోలీసులు తెలిపారు.


Next Story