ఆర్టీసీ బస్సును ఢీకొన్న పెళ్లి బస్సు.. 10 మంది దుర్మరణం

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో

By అంజి  Published on  26 Jun 2023 4:20 AM GMT
Odisha Accident, bus collision,  Ganjam District

ఆర్టీసీ బస్సును ఢీకొన్న పెళ్లి బస్సు.. 10 మంది దుర్మరణం

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బెర్హంపూర్ నుండి తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు రాయగడ జిల్లాలోని గుడారి నుండి ఎదురుగా వస్తున్న ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (OSRTC)ని ఢీకొట్టింది. సోమవారం తెల్లవారుజామన 1 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, గాయపడిన వ్యక్తులకు వైద్యుల బృందం అవసరమైన చికిత్సను అందిస్తున్నట్లు బెర్హంపూర్ ఎస్పీ శరవణ వివేక్ ఎం తెలిపారు. "మేము మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అగ్నిమాపక సేవల బృందాలు, స్థానిక పోలీసులు గాయపడిన వారందరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయి” అని వివేక్ బెర్హంపూర్ వద్ద విలేకరులతో అన్నారు. మృతులు, తీవ్రంగా గాయపడిన వారందరూ ప్రైవేట్ బస్సులో ఉన్నారు. బెర్హంపూర్‌లో ఒక వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు వ్యక్తులు బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గాయపడిన వ్యక్తిని తదుపరి చికిత్స కోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రికి పంపారు. ప్రమాదానికి గురైన రెండు బస్సుల్లో ఒక బస్సు డ్రైవర్ చికిత్స పొందుతుండగా, మరో బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. సీఎం పట్నాయక్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బిక్రమ్ కేశరీ అరుఖా, బెర్హంపూర్ ఎమ్మెల్యే బిక్రమ్ పాండా పరిస్థితిని పర్యవేక్షించేందుకు సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.

Next Story