కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది దుర్మరణం
Nine dead in house collapse at Vellore's Pernambut.తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ భవనం
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2021 2:34 PM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వేలూరులోని పెర్నాంబుట్ లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతి చెందిన వారిని మిస్బా ఫాతిమా, అనీసా బేగం, రూహి నాజ్, కౌసర్, తంజీలా, అఫీరా, మన్నులా, తామెడ్ అఫ్రాగా గుర్తించారు. మృతి చెందిన వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రులను అడుక్కంపరైలోని ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కళాశాల కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెర్నాంబుట్ టౌన్‌లో ఉన్న ఇల్లు ఉదయం 6.30 గంటలకు కుప్పకూలిందని గుడియాతం రెవెన్యూ డివిజనల్ అధికారి ధనంజేయన్ తెలిపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఆ వీధి మొత్తం నడుము లోతు నీటిలో నిండిపోయిందన్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు కూడా కొంత మంది ఆ ఇంటి డాబాపైకి చేరుకుని తలదాచుకుంటుగా ఘటన జరిగినట్లు వివరించారు. సమాచారం అందిన వెంటనే తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిందన్నారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించినట్లు తెలిపారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండే అవకాశం ఉందని.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. ఇల్లు కూలి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులు ఒక్కొక్కరికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.