'వీడొక్కడే' సినిమా రిపీట్, డ్రగ్స్‌ను కడుపులో దాచి తరలింపు

ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ను క్యాప్సుల్స్‌ రూపంలో కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేశాడు. చివరకు కస్టమ్స్‌కు పట్టుబడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 7:45 AM GMT
Nigerian,  drugs,  stomach,  customs,

'వీడొక్కడే' సినిమా రిపీట్, డ్రగ్స్‌ను కడుపులో దాచి తరలింపు

కొందరు వ్యక్తులు బంగారం, డబ్బులు, డ్రగ్స్‌ను వివిధ దేశాల నుంచి తరలించేందుకు ఎన్నో రకాల ఉపాయాలను వేస్తుంటారు. కానీ.. చివరకు కస్టమ్స్‌ అధికారులకు చిక్కి కటకటాల పాలవుతుంటారు. మనం ఓ సినిమా చూసే ఉంటాం. డ్రగ్స్‌ను తరలించేందుకు కొందరు వ్యక్తులు వాటిని ట్యాబ్లెట్లగా మార్చి మింగిసి.. కడుపులో దాచుకుని సరఫరా చేస్తారు. అది ఏమాత్రం పగిలినా ప్రాణాలకే ముప్పు. అయినా.. రిస్క్‌ చేసి డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తారు. సినిమాలో చేసినట్లే ఓ వ్యక్తి రియల్‌ లైఫ్‌లోనూ చేశాడు.

అక్రమదారులు డ్రగ్స్‌ను రవాణా చేసేందుకు కొత్త మార్గాల కోసం అన్వేషిస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ ప్రయాణికుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారీ ఎత్తున డ్రగ్స్ ని పొట్టలో దాచి పెట్టి తరలిస్తున్న వైనం చూసిన కస్టమ్స్ అధికా రులు సైతం షాక్‌ అయ్యేలా చేశాడు. ఇదేంది బాబోయ్‌ ప్రాణాల కంటే డ్రగ్స్‌ తరలింపు ఎక్కువా అని తలలు పట్టుకున్నారు. ఈ సంఘటన ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

అయితే.. డ్రగ్స్ తరలింపు జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు అందింది. దాంతో.. తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ఒక నైజీరియన్‌ అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో.. అతడినిఅధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా అతడి వద్ద ఉన్న లగేజీ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ దొరకలేదు. అతడు ధరించిన దుస్తులు, షూ ఇలా వెతికినా ఏమీ దొరకలేదు. ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్‌లో విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. ఎవరికీ చిక్కకుండా డగ్ర్స్‌ను క్యాప్సుల్స్‌ రూపంలో కడుపులో దాచి తరలిస్తున్నట్లు తేలింది. నైజీరియన్ ప్రయాణికుడు సాహసానికి అధికారులు సైతం అవాక్కయ్యారు. అనంతరం కస్టమ్స్ అధికారులు వెంటనే నైజీరియన్ జాతీయుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం పొట్టలో దాచిన డ్రగ్స్ ని వైద్యులు బయటికి తీశారు.

అతడి కడుపులో నుంచి రూ.12.26 కోట్ల విలువ చేసే 876 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు నిందితుడిని అరెస్టు చేసి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అసలు డ్రగ్స్ ఎక్కడినుండి తీసుకువచ్చాడు? ఎవరికి సరఫరా చేయనున్నాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story