ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య
Newly Married woman committed suicide in kushaiguda police station limits.ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2022 9:10 AM ISTఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేదనో, ప్రియుడు ఫోన్ ఎత్తడం లేదనో కారణాలు ఏమైనప్పటికీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవ వధువు కాళ్ల పారాణి ఆరక ముందే ఆత్మహత్యకు పాల్పడింది. నవ వధువు ఆత్మహత్యకు పాల్పడడం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం లింగగిరికి చెందిన ఏకాంతం చర్లపల్లిలోని ఈసీనగర్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అతడి కుమారై శైలజ(22) ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఈ నెల 17న మేనల్లుడు సతీష్‌తో కుమారై వివాహాన్ని జరిపించాడు.పెళ్లయిన వారం రోజుల తర్వాత అంతా కలిసి ఈ నెల 22న ఈసీనగర్‌కు వచ్చారు. బుధవారం ఉదయం భర్త సతీష్ ఉద్యోగానికి వెళ్లాడు.
బెడ్‌రూమ్‌లో తల్లి ఉండగా.. శైలజ బయటి నుంచి గడి పెట్టింది. హాల్‌లో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి తలుపు తీశారు. ఫ్యాన్‌కు శైలజ వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. వివాహానికి ముందు మేనరికం ఇష్టం లేదని శైలజ చెప్పిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు.