పెళ్లి విషయంలో తెగువ చూపారు.. అయితే..
Newly married couple suicide in Srikakulam District.వాళ్లిద్దరూ బాగా చదువుకున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకుని
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2021 3:57 AM GMTవాళ్లిద్దరూ బాగా చదువుకున్నారు. కలిసి బతకాలని నిర్ణయించుకుని పెద్దలను కాదని వివాహం చేసుకున్నారు. వివాహమైన రెండు నెలల తరువాత సొంతూరుకు వచ్చారు. అయితే.. ఏం జరిగిందో తెలీదు కానీ.. పెళ్లి విషయంలో వారు చూపిన తెగువ కలిసి బతికే విషయంలో మాత్రం చూపలేకపోయారు. ఆవేదన, క్షణికావేశంలో తనువు చాలించారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయం కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రేగిడి మండలంలోని తునివాడకు గ్రామానికి చెందిన హరీష్(29), రుంకు దివ్వ(20) ఎదురెదురు ఇళ్లలో నివసించేవారు. హరీష్ ఎంసీఏ చదువగా.. దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. రెండు నెలల క్రితం(సెప్టెంబర్ 1) స్నేహితుల సమక్షంలో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం విశాఖలో కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగ వేటలో పడ్డారు. పెళ్లై 50 రోజులు పూర్తి కావడంతో.. తమ ఇళ్లలో కోపతాపాలు తగ్గి.. తమను ఆదరిస్తారని బావించి రెండు రోజుల కిందట నవ దంపతులు సొంతూరుకు వచ్చారు.
తల్లిని పట్టుకుని హారీష్ ఏడ్చేశాడు. తండ్రి లేని బిడ్డ కావడంతో ఆ తల్లి కుమారుడి ఓదార్చి ఇంట్లోకి తీసుకెళ్లింది. బుధవారం మధ్యాహ్నాం 2 గంటల సమయంలో దంపతులిద్దరూ పై అంతస్థులోకి వెళ్లారు. హరీష్ తన సెల్‌ఫోన్‌ను కిందనే ఉంచడంతో అది ఇద్దామని.. బంధువుల అబ్బాయి పైకి వెళ్లి చూడగా.. ఇద్దరూ ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించారు. అతడి కేకలతో అందరూ వెళ్లి చూసేసరికి.. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఎటువంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.