ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో.. వెలుగులోకి సంచలన విషయాలు..!
Naga Ramakrishna selfie video before suicide goes viral.భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2022 6:48 AM GMTభద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసుకున్నాడు. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరించాడు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఆ వీడియోలో రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దన్నారు. డబ్బు రూపంలో ఏం అడిగినా ఇచ్చేవాడిని. అయితే ఏ భర్త వినకూడని మాట అడిగాడు. ఆస్తి రావాలంటే తన భార్యను పంపించాలని రాఘవ ఆర్డర్ వేశాడంటూ రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను పంపిస్తే తప్ప ఆస్తి సమస్యకు పరిష్కారం లేదని వనమా రాఘవేంద్రరావు ఖరాఖండిగా చెప్పాడని రామకృష్ణ వాపోయాడు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. ఇక తాను ఒక్కడినే చనిపోతే.. తన భార్యతో పాటు పిల్లలను వదిలిపెట్టరని.. అందుకనే వారిని తనతో పాటు తీసుకువెలుతున్నట్లు చెప్పాడు. అప్పుల్లో ఉన్న తనపై తల్లి, సోదరి కక్ష సాధించారని నాగ రామకృష్ణ సెల్పీ వీడియోలో చెప్పారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రరావును ఏ2గా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 302, 306, 307 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాఘవ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోగి దిగాయి. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా రాఘవ ఆచూకీ తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కేసు నుంచి రాఘవను తప్పించే ప్రయత్నం జరుగుతోంది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సోమవారం తెల్లవారుజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మీ, ఇద్దరు కుమారైలు సాహితి, సాహిత్యపై పెట్రోలు పోసి అనంతరం తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమారై సాహితి తీవ్రంగా గాయపడింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సాహితి బుధవారం కన్నుమూసింది.