చెక్కపెట్టెలో అస్థిపంజరం.. వీడిన మిస్టరీ.. స్నేహితుడి భార్యపై మనసు పడ్డాడు
Mystery revealed in skeleton in wooden box.బోరబండలోని సాయిబాబా ఆలయం సెల్లార్‌లో చెక్కపెట్టెలో అస్థిపంజరం కేసును పోలీసులు చేధించారు.
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2021 5:07 AM GMTబోరబండలోని సాయిబాబా ఆలయం సెల్లార్‌లో చెక్కపెట్టెలో అస్థిపంజరం కేసును పోలీసులు చేధించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న అక్కసుతో ప్రియురాలి భర్తను దారుణంగా చంపిన దుండగుడు ఆ శవాన్ని దేవాలయాల సమూహంలోని సెల్లార్‌లో అద్దెకుంటున్న గదిలో దాచిపెట్టాడు. ఏడాది క్రితం జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ ఇందిరానగర్ ఫేజ్-2 బస్తీలో షిరిడీ సాయిబాబా ట్రస్ట్ దేవాలయం సెల్లార్‌లో ఒక గది ఉంది. ఆగదిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాస్ పాల్ అనే కార్పెంటర్‌కు అద్దెకు ఇచ్చారు.
మొదటి భార్య మరణించగా.. రెండో వివాహాం చేసుకున్నాడు. అదే రాష్ట్రం మిడ్నాపూర్‌కు చెందిన ఫ్లంబర్ కాంట్రాక్టర్ కమల్ మైత్రీ(50) తన కుటుంబంతో కలిసి రాజీవ్‌గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. ఒకే రాష్ట్రం వారు కావడంతో.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ క్రమంలో కమల్ భార్యతో పాల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన కమల్ అతడిని మందలించాడు. తమ సంబంధానికి కమల్ అడ్డుగా ఉన్నాడని భావించిన పాల్.. అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించాడు. గతేడాది జనవరి 10న తన గదికి తీసుకువచ్చి.. అదును చూసి హత్య చేశాడు. అనంతరం శవాన్ని చెక్కెపెట్టెలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అద్దె కోసం నిర్వాహకులు ఫోన్ చేయగా.. ఒకసారి రూ.10వేలు, ఇటీవల మరోసారి రూ.5వేలు బ్యాంకు ఖాతాలో వేశాడు. పాల్ ఎంతకీ రాకపోవడంతో.. ఆలయ అధికారులు గత నెల 28న గోవర్థన్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. గోవర్ధన్ గదిలోని సామగ్రిని తరలిస్తుండగా, ఓ చెక్కపెట్టెలో మనిషి అస్థిపంజరం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దీనివెనుక పలాస పాల్ హస్తం ఉంటుందని భావించిన పోలీసులు అతడు అద్దె చెల్లించిన బ్యాంకు ఖాతా, ఫోన్ కాల్స్ ఆధారంగా ఆచూకీని ట్రేస్ అవుట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం చెప్పాడు. ఈ హత్య వెనుక మృతుని భార్య హస్తం కూడా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.